నేటి సాహిత్యం
ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను, ఉద్యమాలను గుర్తించి వ్యాప్తిలోకి తెచ్చేది సాహిత్యం. జాతీయోద్య్మానికి, ప్రజా చైతన్యానికి సాహిత్యరంగం ఎంతగానో తోడ్పడింది. ఫ్రజా ఉద్యమాలకు సాహిత్యానికి విడదీయరాని సంబంధం ఉంటుంది. నేడు సాహిత్యరంగం అభివృద్ధి చెందినంత వేగంగా దాని మంచి ఫలితాలు సమాజానికి దక్కడం లేదు.
అందరూ సమాన స్థాయిలో – పెద్దవారు, చిన్నవారు, ధనికులు, మధ్య తరగతివారు, బీదలు అనే హెచ్చుతగ్గులు లేకుండాను – ఒకరికేమో గొప్పవారమనే భావం, ఒకరికేమో చిన్నవారమనే న్యూనతా భావం ఇవేమీ లేకుండా ఉండే విధంగా సమాజ పునర్నిర్మాణం జరగాలని అభిలషించేవారు మనలో ఎందరో ఉన్నారు. ఆటువంటి ఆదర్శ సమాజ నిర్మాణం సాధ్యమవవచ్చు లేదా కాకపోవచ్చు. కానీ వాంచిస్తున్నారు.
కేవలం సంపదల నియంత్రణతోనే సమసమాజం సమగ్రంగా రూపు దిద్దుకోదు. ఫ్రాంతీయ, భాష, జాతి, మత విభేదాలు రూపుమాసి పోవు. ఆవినీతి, అక్రమాలు తుడిచిపెట్టుకు పోవు. ఆన్నపానాదులతోనే మనిషి బ్రతకలేడు. శాంతియుత సహజీవనం, పరస్పర సహకారం అతనికి అవసరం. ఇక్కడే సాహిత్యానికి ప్రధాన పాత్ర ఉంది.
గతంలో దారిద్ర్యం, త్రాగుడు, జూదం, స్త్రీల సమస్యలు, శ్రామిక వర్గ సమస్యలు, మొదలగు అంశాలపై కుప్పలు తిప్పలుగా సాహిత్యం వెలువడింది. డానివలన ఒనగూడిందేమిటనేది సింహావలోకనం చేసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. ఏదైన ఒక చెడు సంఘటన గురించి రచనలు వస్తే చెడుగుకు గురైన బాధితులకు ఆ రచనలు చేరే అవకాశాలు బహు తక్కువ. ఆంతేకాక చెడు చేసే వారికేమో ఏమీ పట్టదు. ఫాఠకులు తగిన విధంగా చలించడం లేదు. ఎక్కువ మంది పాఠకులు కాలక్షేపం కోసం అవీ ఇవీ చదువుతారు. సాహిత్యం కాగితాలకే పరిమితం అవడం సబబు కాదు. సమాజాన్ని తమ స్పందన శక్తితో ఆకర్షించగలిగే స్థితిలో సాహితీవేత్తలున్నారా అనే విషయం సందేహాస్పదమే.
సాహితీరంగంలోని వివిధ గుడారాల వారు కలం పట్టేవారిపై తమదైన "ముద్ర" వేయడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. వీరు సృష్టించే దుమారాలు పాఠకులలో విసుగును పుట్టిస్తున్నాయి. ఫాఠకులపై ఉండవలసింది ముఖ్యంగా రచనల ప్రభావం కాని మరొకటి కాదుకదా?
రచనలు చేసేవారు మనిషి ప్రవర్తనపై ఏ విషయమయితే మార్పులు తెస్తుందో అటువంటి విషయాలను మూలంగా తీసుకుని సమాజంలో వైవిధ్యాన్ని పెంపొందించే రచనలు చేయాలి. చదవడానికి, వినేవాళ్ళు అర్ధం చేసుకోడానికి అనువుగా ఉండే రచనలు సత్ఫలితాలనిస్తాయి. ఆలా కాక ఎడపెడా రాసి పారేస్తే రచయతల ఆవేశం చల్లారిపోతుందేమో గాని రచనలలో మాత్రం "జీవం" కానరాదు.
రోజువారీ జీవనంలో అలసిన మనిషి మానసికంగా ఒంటరి వాడైపోతున్నాడు. శాంతియుత సహజీవనానికి మైత్రికి మనుషులు తహతహలాడుతున్నారు. శాంతి అనేది ఒక భౌతిక పదార్ధం కాదు. ఆది ఒక మానసిక అనుభూతి. ఆ మంచి అనుభూతి పొందడానికి మనుషుల్లో దయ, జాలి, కరుణ, మానవత్వం ఇత్యాది లక్షణాలు పుష్కళంగా ఉండి ఉండాలి.
ఆందుకొరకు "మీ పొరుగు వారిని ప్రేమించండి", "మీ పొరుగువారికి తోడ్పడండి" అని దారి చూపే సజీవ సాహిత్యం నేడు అవసరం.
సమ సమాజ స్థాపనకు మేము ఎంతో పాటు పడుతున్నాము అని చాటుకునే వారిలో రుజువర్తన కొరవడుతోంది. మేధావి వర్గంగా చెలామణి అయ్యేవారు నిర్లిప్తంగా ఉంటున్న విషయం జగద్విదితమే. ఛేతల్లో చూపకుండా కపట సిద్ధంతాలు వల్లించే వారు కోకొల్లలు. అటువంటి వారిని కార్యోన్ముఖులను చేయగలిగే సాహిత్యం వెలువడుతూవుంటే సమాజ పునర్నిర్మాణానికి మార్గం కొంత మేరకు సుగమం కాగలదు.
శంకర వెంకట నారాయణరావు,
ఆచంట.